Dad – My Forever Superhero… నాన్న అంటేనే సూపర్ హీరో!
This Father’s Day, celebrated on Sunday, 15 June 2025, is not just a date—it’s a moment to honor the silent strength, the unspoken sacrifices, and the unconditional love of the first hero in our lives – Dad.
ఈ ఫాదర్స్ డే (ఆదివారం, జూన్ 15, 2025) మన జీవితపు తొలి రియల్ హీరో అయిన నాన్నకు అంకితం. ఆయన ప్రేమ మాటల్లో కాకపోయినా, ప్రతి కృషిలో, ప్రతి బలహీనతను మనకోసం దాచిన ధైర్యంలో ఉంది. ఈ వ్యాసం ద్వారా మనం నాన్నపై మన ప్రేమను, అభిమానం ప్రకటించుకుందాం.
నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే……..
బయటకి కనిపించే నాన్న కోపం వెనుక…ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
మనమెక్కిన తొలి విమానం…మన తండ్రి “భుజాలే”!
గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే.
నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది… అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.
మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని… ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’
నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు కాని అపజయం మాత్రం ఉండదు…
జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో… తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు.
ఓడిపోయినా సరే… చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు – ‘నాన్న’.
మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే… మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి
తొలి జీతం అందుకున్న రోజున... మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’
జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.
పిల్లలిని కని, పెంచటం… వారికి విద్యాబుద్ధులు నేర్పించటం… వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉన్నా, తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమ సెంటిమెంట్‌గా వ్రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు… వీటన్నింటినీ చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పవచ్చు. బిడ్డకోసం అమ్మ చేసే త్యాగం ఎంత ముఖ్యమైనదో… నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి. కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం… అన్నీ పరోక్షమైనవి. నవమాసాలు మోసి పిల్లలిని కనటంవలన స్త్రీ (తల్లి)దే పైచేయి. పైగా పిల్లల అవసరాలరీత్యా బాల్యము అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది. అందుకే అమ్మతో ఆ బంధం అంత సులభంగా, సహజంగా ఏర్పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. కానీ తండ్రి పిల్లలకు అవసరమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటూ రాకుండా చూస్తాడు. పిల్లల దగ్గర ఎప్పుడూ తండ్రి ఉండేటట్టు చూసి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా జూన్ 3 వ ఆదివారం ‘ఫాదర్స్ డే’ ను జరుపుకుంటున్నారు.
భార్య గర్భం దాల్చిన దగ్గర్నించి ఆమెతో పాటు సమానంగా ఆమెను, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునే తండ్రుల సంఖ్య పెరిగింది. ప్రసవం సమయంలో, ప్రసవానంతర సమయంలో స్త్రీకి ధీటుగా స్త్రీకన్నా ఎక్కువగా కూడా పుట్టిన బిడ్డని ఎంతో జాగ్రత్త తో కూడిన మమకారంతో చూస్తున్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అసలు కొన్నిచోట్ల పురుషునికి కూడా పేటర్నిటీ లీవ్ ఇస్తారని వినికిడి. మనదేశంలో కూడా ఇలా భార్యను, పిల్లల్ని బాధ్యతగా ప్రెగ్నెన్సీ నిర్ధారణ జరిగినరోజు నుంచి అత్యంత ఆదరంగా, అభిమానంగా చూసే భర్తలు ఎందరో? అంటే అలాంటి తండ్రులకి… నేడు ‘ఫాదర్స్ డే’ గ్రీటింగ్స్ చెప్పాల్సిన బాధ్యత మనకి లేదా? తల్లి స్థానం ‘నిజం’ అని, తండ్రి స్థానం ‘నమ్మకం’ అనేమాటను వినే ఉంటారు చాలామంది. తండ్రి ఎవరో తల్లి చెప్తే తప్ప తెలీదు అనే స్త్రీవాదులున్నప్పటికీ సైంటిఫిక్‌గా అది నిజం కానే కాదుట. పసిపిల్లలు తమ తండ్రిని గుర్తిస్తారుట. కళ్ళు తెరిచినప్పటి నుంచీ తమ తల్లితోపాటుగా తండ్రికోసం కూడా వెతుకుతారట. అంటే తమ తండ్రి స్పర్శను వారు చక్కగా గుర్తించగలరు. తల్లిదండ్రులు బిడ్డలమధ్య పెనవేసుకున్నది ‘జెనిటిక్ బాండ్’. అది తరతరాలకి పాకే అపూర్వ నిధి.
మార్గదర్శకుడిగా తండ్రి………..
‘ధైర్యం నాన్న ఇచ్చేది… భద్రత నాన్న ఇచ్చేది… క్రమశిక్షణ నాన్న నేర్పేది… అవసరాలు నాన్న తీర్చేవి’… పిల్లలకు తండ్రి రోల్ మోడల్. బిడ్డ అభివృద్ధే నాన్న లక్ష్యం. తండ్రి ప్రభావం కన్పించేది కాదు… అనుభవించేది. వంద మంది ఉపాధ్యాయుల పెట్టు ఒక తండ్రి. తండ్రి కోపం వెనుక బాధ్యత ఉంది. ఎలా బ్రతకాలో నేర్పించడు తండ్రి. కాని బ్రతకటం ఎలాగో తన పిల్లలకి తెలిసేట్లుగా నేర్పించగలడు. మంచి తండ్రి ఉన్న బిడ్డలు ధన్యులు’ ఇలా ఎన్నో చెప్పగలము తండ్రి గురించి. అసలు తండ్రి చూపే అభిమానం, బాధ్యతలు ఎవరికీ స్పష్టంగా కనబడవు. కానీ ప్రభావం చాలా ఉంటుంది. ఒకప్పటి తండ్రులు తమ హాబీలకు, ఇతర సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చాకే కుటుంబం, భార్య, పిల్లలు అన్నట్లుగా వ్యవహరించినా… నేటితరంలో తండ్రులు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పిల్లల చదువు, కెరీర్ విషయాల్లో ఆలోచిస్తున్నారు.
ఈ తరం తండ్రులు…
- పెత్తనానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
- ఇంటి పనుల్లో సంపూర్ణంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
- పిల్లలకి అనుగుణంగా స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు.
- పిల్లల భావోద్వేగాలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు.
- అదనపు బాధ్యతలు మోయటంలో ఉత్సాహంగా ఉన్నారు.
- హాబీలు, అవసరాలు కూడా విస్మరిస్తున్నారు.
- బిడ్డపట్ల అపరిమితమైన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు.
- స్త్రీ ఉద్యోగ, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడినా తను మాత్రం సంతోషంగా అన్నీ బాధ్యతలు మోయటం గమనార్హం.
- పురుషాహంకారం అనే మాటకి అవకాశం లేకుండా పిల్లల స్నానం, భోజనం తినిపించటం అన్నీ తానే చూస్తున్నారు.
- పిల్లల్ని ఎత్తుకు తిప్పటం, లాలించడం, ఆడిరచటం అనే పనులకి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు తమ పనులు, అవసరాలు కూడా మరిచిపోయి.
ఒకప్పుడు ‘‘అమ్మ కూచి’’ అన్న మాటలు నేడు చాలావరకు (ఈనాటి తండ్రుల హయాంలో) వినబడటం లేదు. ‘‘నాన్న కూచి’’ అన్నదే తరచుగా మనకి వినబడుతున్నది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ‘‘నాన్న కూచిలే”!’ అయిపోతున్నారు.
సహనం, ప్రేమ, అనురాగం, అభిమానం, బాధ్యత… ఆలనాపాలనా… అన్నింటా తలులను మించిపోతున్నారు నేటి తండ్రులు. పిల్లలు పసిమొగ్గలు కదా! వారికి ఎవరో నేర్పక్కర్లేదు. అమ్మని… నాన్నని అభిమానించమని. కాని నేటి సిసింద్రీ లు నాన్న కావాలి, నాన్నతో వెళతాం అనటం చాలా విడ్డూరమా? కాదు, అలా పిల్లల్ని పెంచటంలో తండ్రులు తీసుకునే పాత్ర అలా ఉంది. తండ్రి ఎటువంటివాడైనా తన కన్నబిడ్డ క్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటాడు అనటంలో అనుమానమే లేదు. ఎవరి మెప్పుకోసమో తన కుటుంబం కోసం పాటుపడరు. అయినా సంఘం లో తల్లి పాత్రకి వచ్చినంత గుర్తింపు తండ్రిపాత్రకు రావటం లేదు. పిల్లల ఆర్థిక అవసరాలు తీర్చటం, విద్యాబుద్ధులు నేర్పటం, భార్య, పిల్లల అవసరాలు గుర్తించటం, ఇంటి యజమానిగా తగిన సరియైన నిర్ణయాలు తీసుకోవటం… ఇవి తండ్రి బాధ్యతలుగా సంఘం నిర్దేశించింది.
అవసరాల రీత్యా చిన్నతనంలో, అందునా బాల్యంలో తల్లికి అతి దగ్గరైన పిల్లలు సైతం వయసు వచ్చే కొద్దీ తమ తండ్రి విలువను తెలుసుకుని, ఆయన మనసుని అర్థం చేసుకుని ఆయన్నీ గౌరవిస్తారు. అసలు పిల్లలకి తొలి హీరో తమ ‘తండ్రే’. పిల్లలు పసితనం నుంచి ఊహ తెలిసేలోపల ఏ టి.వి. యాడ్ చూసినా అందులో పురుష పాత్ర కనపడగానే ‘నాన్న… డాడీ’ అని పిలవటం చూస్తుంటాం.
సమాజంలో……………..
మన సమాజంలో తండ్రుల మీద ఒక రకమైన భావం ఉంది. భర్తను పోగొట్టుకున్న స్త్రీ మరో వివాహం చేసుకోదు. పిల్లలకోసం బ్రతుకుతుంది. కానీ భార్య మరణించిన వ్యక్తి మరో వివాహానికి సిద్ధపడతాడు అంటారు. తల్లులలాగా తండ్రులు పిల్లల కోసం త్యాగం చేయరని ఒక బలమైన అభిప్రాయం. ఇది సామాజికంగా ఉన్న అభిప్రాయమే తప్ప, పిల్లల్ని నిర్లక్ష్యంతో తండ్రి వివాహం చేసుకోవటం కానే కాదు. పిల్లల బాగోగులు చూసేందుకే అతను మరొక పెళ్ళి చేసుకునే ఆలోచన అన్నది అంతరార్థం!
ఎప్పటినుంచి జరుపుకుంటున్నారు………….
బాధ్యతగల పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి పాత్ర ప్రాముఖ్యతను గుర్తించి ప్రశంశిస్తూ చేసే అందమైన రోజు ‘ఫాదర్స్ డే’. ప్రపంచవ్యాప్తంగా తండ్రి పాత్ర కీల కమైనా గత శతాబ్దివరకు పిల్లల జీవితంలో తండ్రి పాత్రకు సంబంధించిన అధికారిక గుర్తింపు లేదు. అసలు ఫాదర్స్ డే ఉత్సవాలను జరపాలని ఆ అవసరాన్ని గుర్తించిన మహిళ వింగ్ డాటర్ సొనారా. ఆమె వాషింగ్టన్‌లోని స్పొకన్‌కు చెందింది. ఆధునిక ఫాదర్స్ డే ఉత్సవాలకు మూలం ‘అమెరికా సంయుక్త రాస్ట్రాలు’. అయినా అన్ని ప్రపంచదేశాలకు పాకింది తండ్రుంలందరి గౌరవార్థం ఈ పండుగ! 1909లో మదర్స్ డే అనేమాట స్మార్ట్ కుటుంబంలో తండ్రి పోషించిన పాత్ర ‘ఫాదర్స్ డే’కి పునాది అయ్యింది. అసలు దానివెనుక కథ! హెన్రి జాక్సన్ స్మార్ట్, విలియమ్ స్మార్ట్ దంపతులు స్పొకన్ గ్రామంలో వుండేవారు. వారికి ఆరుగురు సంతానం. వారిలో చివరి సంతానం ‘సొనారా’. ఆమె ఆరునెలల వయసులో తల్లి మరణించింది. అందరికన్నా పెద్ద పిల్ల 12 సంవత్సరాలు. ఇది 1885 నాటి స్థితి. అయితే అప్పుడు అతను (తండ్రి) మరల వివాహం చేసుకోవచ్చు. ఆ అవకాశం, హక్కు సమాజంలో ఉన్నాయి. కానీ తను వివాహం చేసుకొని సంసార సుఖంకన్నా కూడా తండ్రిగా తన పాత్రను నిర్వహించేందుకు చాలా ఇష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూనే ఆరుగురు బిడ్డలకి తల్లి లేని లోటు తెలీకుండా పెంచాడు. ఆఖరిదైన సొనారాకి ఆయనే తల్లి, తండ్రి అయ్యి, పాలు పట్టడం, స్నానం, ఆహారం, జోలపాడి నిద్ర పుచ్చటం, అన్నీచేసి తల్లి పాత్రను అద్భుతంగా పోషించాడు. అసలు ఆయన పెంపకంలో ఆమెకి తల్లి అనేది ఉంటుందని… తల్లి పాత్ర ఎలా ఉంటుందని కానీ తెలీలేదు. ఆమెకి తెలిసింది తనని కంటికి రెప్పలా కాపాడిన తండ్రి. ఊహ తెల్సింది మొదలు కళ్ళముందు తండ్రి. దైవంలా తనను కాపాడిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కోసం బాగా ఆలోచించింది. అందులోంచి వచ్చినదే వేడుకగా అతని ‘పుట్టిన రోజు’ ఘనంగా నిర్వహించటం.
తన తండ్రి మిగిలిన తండ్రిలా కాదు. ఆషామాషీగా నిర్వహించకూడదు. తమకోసం ఎంతో త్యాగం చేసిన మానవతామూర్తి. అందుకే ఆయన జన్మదినాన్ని తండ్రుంలందరి జన్మదినంగా జరపాలని ఆమె అనుకుంది. కానీ ఆయన పుట్టిన తేదీ తెలియదు. కాని, జూన్ నెలలో పుట్టినట్లుగా తెలుసు. అందుకే జూన్ నెలలో ఒకరోజు గ్రామంలోని వారందరినీ పిలిచి ఈ పుట్టినరోజు కేవలం తన తండ్రిదే కాదని, అందరి తండ్రుందరిదీ అని, తండ్రులు నిర్వహిస్తున్న పాత్రను మొత్తం సమాజం తెలుసుకునే రోజని, పిల్లలకి తండ్రి ప్రేమ తెలిపే రోజని, దీన్ని ‘‘ఫాదర్స్ డే’’గా జరుపుకుందాం అని ప్రకటించింది సొనారా. పైగా మదర్స్ డే ఉన్నప్పుడు ఫాదర్స్ డే కూడా ఎందుకు నిర్వహించరాదని సొనారా ప్రకటించింది. అంతా నవ్వుకున్నా కూడా ఆమె ఆ ‘‘ఫాదర్స్ డే’దీ’ గుర్తింపుకోసం నిజాయితీగా తీవ్రంగా ప్రచారం చేసింది. 1910 జూన్ 19వ తేదీన ‘స్పొకన్’లో తొలి ఫాదర్స్ డే జరుపుకున్నప్పుడు ఆమెకు తొలి విజయ సంకేతాలు కన్పించాయి. మినిస్టీరియల్ అసోసియేషన్ స్థానిక యంగ్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ (వై.ఎం.సి.ఏ.) మద్దతుతో ఈ కార్యక్రమం జరిగింది.
అసలు మొదట జూన్ 5న మమతానురాగాలు అందించే తండ్రి పుట్టినరోజును ‘ఫాదర్స్ డే’గా నిర్వహించాలనుకున్నా ఏర్పాట్లకి తగిన సమయం లేక జూన్ 3వ ఆదివారంనాడు నిర్వహించారు. అయితే 1916లో ఉడ్రోవిల్సన్ అధికారికంగా ఆమోదించాడు. 1966 జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించాలని తీర్మానంపై అప్పటి అధ్యక్షుడు ‘లిండన జన్మన్’ సంతకాలు చేసాడు. 1972లో ‘రిచర్డ్ నిక్సన్’ (అప్పటి అధ్యక్షుడు) జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించాలని శాశ్వత జాతీయ ప్రతిపత్తిని కల్పించారు. ఆనాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే ప్రసిద్ధి పొందింది.
నేటి ఆధునిక ఫాదర్స్ డే మాత్రమేకాక తండ్రులకి ప్రత్యేక రోజును కృతజ్ఞతా సూచకంగా కేటాయించినట్లు అనేక వేల సంవత్సరాల క్రితం ఉందని చరిత్రకారులు అంటారు. బాబిలోన్ శిధిలాల్లో లభించినట్లు చేస్తారు ఫాదర్స్ డే ఆనవాళ్ళు!
ఎల్మెసు అనే పిల్లాడు నాలుగువేల సం॥రాల క్రితం మట్టితో కారు తయారుచేసి దానిపై ఫాదర్స్ డే సందేశాన్ని చెక్కించినట్లు చరిత్రకారులు చెప్తారు. అందులో తన తండ్రి మంచి ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలని ఎల్మెసు తండ్రికి ఏం జరిందన్నది అన్నట్లు ఫాదర్స్ డే ఉత్సవాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుపుకునే ఆచారం ఉంది.
ఫాదర్స్ డే మూల… సిద్ధాంతాలు…
- 1908 తొలి ఫాదర్స్ డే, చర్స్ సర్వీస్, వెస్ట్ వర్జీనియా (కొందరి ఉద్దేశం)
- ఇంకొందరు వాషింగ్టన్లో వాంకోవర్‌లో, తొలి ఫాదర్స్ డే అంటారు.
- 1915 చికాగో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు హ్యారీమీక్ జరిపాడంటారు.
- మరికొందరు చరిత్రకారులు ‘‘ఫాదర్స్ డే’’ ప్రారంభ ఘనతను వెస్ట్ వర్జీనియాకు చెందిన శ్రీమతి చార్లెస్ క్లేటన్ది అని అంటారు. పాశ్చాత్యదేశాల నుంచి దిగుమతి అయిన వేడుక ఇది. మనదేశంలో దీని వయస్సు శతాబ్ది కాలం లోపే.
- నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప!
- ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …
- నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
- పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’
చివరిగా ఒక్క మాట
మనకి తండ్రి విలువ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.
మరి నాన్నమాట విందాము…భవిష్యత్తు బంగారు మయం చేద్దాము.
ఎందుకంటే నాన్న అంటేనే సూపర్ హీరో కదా…. ఒప్పుకుంటారుగా???????
డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి
జ్యోతిష్య వాస్తు నిపుణురాలు